భాషా ప్రయుక్త రాష్ట్రాలు – తెలుగు రాష్ట్రాల పైన డాll.బి. ఆర్. అంబేద్కర్ గారు చెప్పిన ముఖ్యమైన అంశాలు – ప్రతి ఒక్కరూ తప్పక చదవండి
ప్రారంభంలో డా॥బి.ఆర్. అంబేద్కర్ ఒక భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉండాలని భాషాప్రయుక్త రాష్ట్రాలకు సంపూర్ణ మద్దతును తెలియజేసారు. ఇదే విషయాన్ని 1948 లో ధార్ కమీషన్కు విన్నవించారు. అయితే కాలక్రమంలో అంబేద్కర్ తన అభిప్రాయాలను మార్చుకొని చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ చేసారు.
1955లో తాను వ్రాసిన “Thoughts on Linguistic States’ అనే పుస్తకంలో ఈ క్రింది అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒకే భాష మాట్లాడేటట్లుగా పునర్వ్యవస్థీకరణ జరగాలి. అంటే ఒక రాష్ట్రానికి ఒకే భాష
ఉండాలి కాని ఒకే భాష వారికి అనేక రాష్ట్రాలు ఉండవచ్చు. భాష మాట్లాడే వారికి బహు రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలని, మరాఠి మాట్లాడే మహారాష్ట్రను 3 లేదా 4 రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేసారు.
తెలంగాణ పైన SRC సిఫారసులను స్వాగతించారు. తెలుగు మాట్లాడే ప్రజలకు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలు సబబే అని తెలియజేసారు.
చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యడము వలన స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందని, పరిపాలన కూడ సమర్ధవంతంగా కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యడము వలన దళితులకు మరియు మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యము పెరుగుతుంది.
పెద్దరాష్ట్రాలు కేంద్రప్రభుత్వాన్ని ప్రభావితం చేసి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలియజేసారు.
ఉత్తరాదిన పెద్దరాష్ట్రాలు మరియు దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యడము వలన సమతౌల్యం దెబ్బతింటుందని తెలియజేశారు. జనాభా మరియు భౌగోళిక అంశాల ఆధారంగా అన్ని రాష్ట్రాలు ఒకే పరిమాణంలో ఉండటము శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. రెండుకోట్ల జనాభాకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సహేతుకంగా ఉంటుందని తెలియజేశారు.
రాష్ట్రాల ఏర్పాటు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా శాస్త్రీయంగా నిష్పక్షపాతంగా జరగాలి. జనాభా, విస్తీర్ణము, ఆర్థిక స్వావలంబన, భాష ఇత్యాది అంశాల ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యాలని అభిప్రాయపడ్డారు.